
న్యూఢిల్లీ:, 22 అక్టోబర్ (హి.స.)
ఢిల్లీ విశ్వవిద్యాలయం (డియు) తన 103వ స్నాతకోత్సవ వేడుకను నవంబర్ 20న నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానుండగా, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు.
స్నాతకోత్సవ ఏర్పాట్లను సమీక్షించేందుకు ప్రొఫెసర్ యోగేష్ సింగ్ గురువారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ వేడుక అత్యంత వైభవంగా, సజావుగా సాగేలా చూడాలని అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో డియు రిజిస్ట్రార్ డాక్టర్ వికాస్ గుప్తా, పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ గుర్ ప్రీత్ సింగ్ టుటేజా, సాంస్కృతిక మండలి ఛైర్పర్సన్ అనుప్ లాథర్, అకాడమిక్ వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ కె. రత్నాబలి, వివిధ కమిటీల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ యోగేష్ సింగ్ మాట్లాడుతూ, విశ్వవిద్యాలయ చరిత్రలోనే తొలిసారిగా విద్యార్థులు కోర్సు పూర్తి చేసిన సంవత్సరంలోనే పట్టాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లేందుకు, ఉద్యోగాలు పొందేందుకు డిగ్రీ పట్టాలు తక్షణమే అవసరమవుతాయని, విద్యార్థుల సౌకర్యాన్ని దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ ఏటి స్నాతకోత్సవంలో మొత్తం 85,231 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు, 7,235 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేయనున్నారు. వీటితో పాటు 400 మందికి పైగా పరిశోధక విద్యార్థులకు పీహెచ్డీ డిగ్రీలు అందజేయనున్నారు. వేడుకల్లో భాగంగా ప్రతిభ చూపిన 163 మంది విద్యార్థులకు స్వర్ణ పతకాలు, ఒకరికి రజత పతకం, మరో 34 మందికి వివిధ ప్రత్యేక పురస్కారాలు అందజేయనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi