
న్యూ ఢిల్లీ , 25 అక్టోబర్ (హి.స.)
సౌదీ అరేబియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం విమాన రాకపోకలపై పడుతోంది.
ఈ నేపథ్యంలో పలు భారతీయ విమానయాన సంస్థలు సౌదీలోని వివిధ నగరాలకు నడిపే సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.
ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో, ఆకాశ్ ఎయిర్ సంస్థలు ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.
ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు రియాద్, దమ్మామ్ నగరాలకు వెళ్లే విమానాలను నవంబర్ 7వ తేదీ వరకు నిలిపివేశాయి. జెడ్డాకు నడిచే సర్వీసులను అక్టోబర్ 31 వరకు రద్దు చేసినట్లు వెల్లడించాయి. అక్టోబర్ 24లోపు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ప్రయాణ తేదీని ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా మార్చుకునే వెసులుబాటు కల్పించడంతో పాటు, టికెట్ మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నట్లు తెలిపాయి.
ఇక ఇండిగో సంస్థ జెడ్డా, దమ్మామ్, మదీనా నగరాలకు వెళ్లే విమాన సర్వీసులను అక్టోబర్ 31 వరకు నిలిపివేసింది. ఆకాశ్ ఎయిర్ కూడా తన సర్వీసుల్లో మార్పులు చేసింది. జెడ్డాకు వెళ్లే విమానాలను నవంబర్ 10 వరకు, రియాద్‌కు నడిచే సర్వీసులను నవంబర్ 30 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామాలతో సౌదీ అరేబియాకు వెళ్లాల్సిన వారు, అక్కడి నుంచి భారత్‌కు తిరిగి రావాలనుకునే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉమ్రా యాత్రకు వెళ్లిన భక్తులు, సౌదీలో చిక్కుకుపోయిన భారతీయులు ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాల కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రయాణికులకు సహాయం అందించేందుకు జెడ్డాలోని భారత కాన్సులేట్ చర్యలు చేపట్టింది. 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి, అవసరమైన వారికి సహాయం అందిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..