
హైదరాబాద్ , 25 అక్టోబర్ (హి.స.)
హైదరాబాద్లోని వివిధ నియోజకవర్గాల్లో నేడు, రేపు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సమావేశాలు నిర్వహించనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియపై ప్రధానంగా చర్చించనున్నారు. అర్హులైన పట్టభద్రులు ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకునేలా పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన చర్యలపై నాయకులు సమీక్ష నిర్వహించనున్నారు.
ఈ సమావేశాల్లో ఓటరు నమోదు ప్రక్రియ ప్రస్తుత పరిస్థితి, దరఖాస్తుల స్వీకరణ, వాటి పరిష్కారంలో ఎదురవుతున్న సమస్యలు వంటి అంశాలను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. అర్హత ఉన్నప్పటికీ ఓటరు జాబితాలో పేరు నమోదు కాని పట్టభద్రులను గుర్తించి, వారు అవసరమైన దరఖాస్తులు సమర్పించేలా అవగాహన కల్పించడంపై దృష్టి సారించనున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఈ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, ఓటరు నమోదు దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరగకుండా చూడాలని కోరుతూ బీఆర్ఎస్ ప్రతినిధి బృందం రేపు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)ను కలవనుంది. దరఖాస్తులను బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) ఎప్పటికప్పుడు పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్