రక్షణ రంగంలో భారత్ను సూపర్పవర్గా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్రెడ్డి
రక్షణ రంగంలో భారత్ను ప్రపంచ స్థాయిలో అగ్రగామి దేశంగా నిలబెట్టేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు.
Telangana CM Revanth Reddy


హైదరాబాద్ , 25 అక్టోబర్ (హి.స.)

రక్షణ రంగంలో భారత్ను ప్రపంచ స్థాయిలో అగ్రగామి దేశంగా నిలబెట్టేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. రక్షణ పరిశ్రమలకు తెలంగాణను ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ఫలక్నుమా ప్యాలెస్లో నిర్వహించిన రక్షా ఎక్స్పో–2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

హైదరాబాద్కు వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం ఉందని సీఎం పేర్కొన్నారు. సముద్రతీరం లేకపోయినప్పటికీ నౌకాదళానికి అవసరమైన సేవలు అందించడంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. రక్షణ రంగానికి అవసరమైన నైపుణ్యాలు కలిగిన యువతను తయారు చేసేందుకు రాష్ట్రంలోని ఐటీఐలను ఆధునిక శిక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దినట్లు తెలిపారు.

భారత్ కేవలం రక్షణ పరికరాలను దిగుమతి చేసుకునే దేశంగా కాకుండా, అధునాతన రక్షణ సాంకేతికతను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. రక్షా ఎక్స్పోను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే కార్యక్రమంగా అభివృద్ధి చేయాలన్నది తన ఆలోచనగా వెల్లడించారు.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లోనూ పాల్గొనాలని ఆహ్వానించారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల విషయంలో అందరూ ఏకతాటిపైకి రావాలని అన్నారు. త్వరలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 2.0ను విడుదల చేస్తామని ప్రకటించారు. రక్షణ రంగంలో దేశం సాధించే పురోగతికి తెలంగాణ తనవంతు సహకారం అందిస్తుందని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande