
హైదరాబాద్ , 25 అక్టోబర్ (హి.స.)
నగరంలోని రామంతపూర్ చర్చి కాలనీలో స్క్రాప్ దుకాణంలో పేలుడు సంభవించడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడగా, అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దుకాణంలో ఒక్కసారిగా పేలుడు జరగడంతో మంటలు చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
పేలుడు ధాటికి దుకాణంలో మంటలు వ్యాపించడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టి, కొంతసేపటి తర్వాత వాటిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ఘటనలో కాలిన గాయాలైన వ్యక్తి దుకాణం నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం. అతడిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్