హుజూరాబాద్ డివిజన్లో సీబీసీఐడీ సోదాలు.. నలుగురు రైస్ మిల్లర్ల అదుపులోకి
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డివిజన్లో సీబీసీఐడీ అధికారులు సోదాలు నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Police


హుజూరాబాద్ , 25 అక్టోబర్ (హి.స.)

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డివిజన్లో సీబీసీఐడీ అధికారులు సోదాలు నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన బియ్యంలో నాణ్యతకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.

ఈ వ్యవహారంలో భాగంగా నలుగురు రైస్ మిల్లుల యజమానులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హుజూరాబాద్లో ఒకరిని, జమ్మికుంటలో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆదివారం ఉదయం అధికారులు వారి ఇళ్లకు వెళ్లి విచారణ నిమిత్తం వారిని తమ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ప్రభుత్వానికి అందజేయాల్సిన బియ్యంలో సన్న బియ్యానికి బదులుగా దొడ్డు బియ్యం సరఫరా చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సరఫరా చేయాల్సిన బియ్యం రకాన్ని మార్చి పంపించారా? ఈ వ్యవహారంలో మరెవరైనా భాగస్వాములుగా ఉన్నారా? అనే కోణాల్లో అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

సీబీసీఐడీ విచారణలో బియ్యం సేకరణ, నిల్వలు, సరఫరాకు సంబంధించిన అంశాలను పరిశీలించే అవకాశం ఉంది. అయితే, ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా వెల్లడయ్యే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. విచారణ అనంతరం అధికారులు మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande