బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా బలపడే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ పలు ప్రాంతాలకు వర్ష సూచనలు జారీ చేసింది.
karnataka-weather-update-bengaluru-cloudy-rain-coastal-districts


హైదరాబాద్ , 25 అక్టోబర్ (హి.స.)

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా బలపడే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ పలు ప్రాంతాలకు వర్ష సూచనలు జారీ చేసింది. ఈ వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లడం, లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం వంటి సమస్యలు తలెత్తే అవకాశముంది.

అలాగే జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. హనుమకొండ, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో సంబంధిత ప్రాంతాల అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు తెలంగాణలోని చాలా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు వాతావరణ శాఖ సూచనలను గమనిస్తూ, అత్యవసరమైతే తప్ప వర్షాలు ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలి. రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రాంతాల్లో అధికారులు ఇచ్చే హెచ్చరికలను తప్పనిసరిగా అనుసరించాలి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande