
అమరావతి , 27 అక్టోబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ విద్యుత్ ఉత్పత్తి రంగంలో మరో ముఖ్యమైన ముందడుగు వేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలు జిల్లాలో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కావడం రాష్ట్ర ఇంధన రంగ అభివృద్ధిలో కీలక పరిణామమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
కర్నూలు ప్రాంతంలో సుమారు 2,400 ఎకరాల విస్తీర్ణంలో ఎస్ఏఈఎల్ సంస్థ ఏర్పాటు చేసిన భారీ సోలార్ ప్లాంట్ నుంచి 600 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభమైనట్లు చంద్రబాబు వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అవుతున్న స్వచ్ఛ విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. సంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడటాన్ని తగ్గించి, పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో ఇటువంటి ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రాన్ని క్లీన్ ఎనర్జీ రంగంలో ప్రముఖ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి ఈ సోలార్ ప్లాంట్ నిదర్శనమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో ప్రకటించిన లక్ష్యాలను కార్యరూపంలోకి తీసుకువస్తున్నామని తెలిపారు. పునరుత్పాదక ఇంధన రంగంలో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. స్వచ్ఛ విద్యుత్ ఉత్పత్తి విస్తరణతో ఆంధ్రప్రదేశ్ ఇంధన రంగానికి మరింత బలం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్