
శ్రీకాకుళం , 27 అక్టోబర్ (హి.స.)
శ్రీకాకుళం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. శ్రీకాకుళం, గార, లావేరు, ఆమదాలవలస, బూర్జ, పాతపట్నం, ఎల్ఎన్ పేట, నరసన్నపేట, టెక్కలి, వజ్రపుకొత్తూరు మండలాల్లో వర్షం పడుతోంది. సారవకోట, కవిటి, కంచిలి, సోంపేట మండలాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాల ప్రభావం, క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించారు.
మంత్రి అచ్చెన్నాయుడు కూడా జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. తీరప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు అవసరమైన సమాచారం అందించాలని ఆదేశించారు. ముఖ్యంగా జిల్లాలోని 11 తీర మండలాల పరిధిలో ఉన్న మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్