తుపానును ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తంగా ఉంది : హోంమంత్రి అనిత
తుపాను ముప్పును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు.
Anitha


అమరావతి , 27 అక్టోబర్ (హి.స.)

తుపాను ముప్పును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు. తుపాను ప్రభావం పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు అవసరమైన సూచనలు అందించాలని స్పష్టం చేశారు.

తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. రహదారులపై చెట్లు కూలిపడే అవకాశం ఉన్నందున ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

రైతులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ పొలాలకు వెళ్లాలని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో బయట ఉండకూడదని హెచ్చరించారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. సముద్రంలో వాతావరణం అనుకూలంగా లేని నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని స్పష్టం చేశారు.

తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande