
విజయనగరం , 27 అక్టోబర్ (హి.స.)
తుపాను ప్రభావం నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విజయనగరం జిల్లాలోని విద్యాసంస్థలకు అధికారులు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. నేటి నుంచి రేపటి వరకు జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు వర్తిస్తుందని కలెక్టర్ ఎస్. రాంసుందర్రెడ్డి వెల్లడించారు. తుపాను కారణంగా వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తుపాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రయాణాల సమయంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు పాఠశాలలకు వెళ్లి తిరిగి ఇళ్లకు చేరుకునే సమయంలో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారితే సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్