
న్యూఢిల్లీ, 27 అక్టోబర్ (హి.స.)
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్–2023 (DPDP Act), దాని అమలుకు రూపొందించిన డీపీడీపీ రూల్స్–2025లోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు స్పందించింది. డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్పై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. చట్టం అమలుపై మధ్యంతర స్టే విధించాలన్న విజ్ఞప్తిపైనా నోటీసులు ఇచ్చింది.
గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీలకు అనుబంధంగా ఉన్న సంస్థలతో పాటు మొత్తం 21 మీడియా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ ఈ పిటిషన్ను దాఖలు చేసింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)లోని సెక్షన్ 8(1)(జె)కు చేసిన సవరణల వల్ల ప్రజా ప్రయోజనాల కోసం సమాచారాన్ని వెలుగులోకి తీసుకొచ్చే అవకాశాలు పరిమితం కావచ్చని అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ వాదనలు వినిపించారు. జర్నలిజంలో వార్తల తాజాదనం, వేగం అత్యంత కీలకమని ఆమె పేర్కొన్నారు. వార్తలను ప్రచురించే ముందు సంబంధిత వ్యక్తుల అనుమతి లేదా సమ్మతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే వార్తా సేకరణతో పాటు ప్రచురణ ప్రక్రియ కూడా ప్రభావితమవుతుందని కోర్టుకు వివరించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో జస్టిస్ జయమాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం తన స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..