
ఢిల్లీ, 27 అక్టోబర్ (హి.స.)
కార్యాలయాలు మరియు బహిరంగ ప్రదేశాలలో మహిళల భద్రతను మెరుగుపరిచేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఒక సమగ్ర అడ్వైజరీని విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖలు, రైల్వే బోర్డుతో పాటు అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది. ఆయా ప్రభుత్వాలు తమ పరిధిలో చేపట్టిన చర్యలకు సంబంధించి రెండు నెలల వ్యవధిలో సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.
పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే గణాంకాల ప్రకారం భారత కార్మిక రంగంలో మహిళల భాగస్వామ్యం ప్రతిఏటా పెరుగుతోంది. అలాగే జాతీయ నేర నమోదు బ్యూరో లెక్కల ప్రకారం మహిళలపై నమోదవుతున్న నేరాల సంఖ్య కూడా ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం అత్యంత ప్రాధాన్య అంశంగా మారింది. లైంగిక వేధింపుల నివారణ, ఉపాధి ప్రదేశాల్లో భద్రత, రవాణా సౌకర్యాల మెరుగుదల, సైబర్ నేరాల నియంత్రణ, పోలీసు స్పందన వ్యవస్థ మరియు బాధితులకు మానసిక, న్యాయ సహాయం అందించడం వంటి ముఖ్య అంశాలపై హెచ్ఆర్సీ ఈ మార్గదర్శకాలలో ప్రత్యేక దృష్టి సారించింది.
దేశవ్యాప్తంగా మహిళలకు రక్షణ కల్పించినప్పుడే వారు ఆర్థికంగా, సామాజికంగా మరింత అభివృద్ధి సాధించగలరని కమిషన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ, గృహ నిర్మాణ, రవాణా, హోం, కార్మిక తదితర శాఖలకు ఈ అడ్వైజరీ కాపీలను పంపించారు. కమిషన్ ఇచ్చిన ఈ ఆదేశాలు ఉద్యోగ ప్రదేశాల్లో మరియు పబ్లిక్ ప్రదేశాల్లో మహిళల రక్షణకు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టేలా దోహదపడతాయని భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi