
అమరావతి , 28 అక్టోబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. రాబోయే మూడు గంటల్లో రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
శ్రీకాకుళం, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇతర జిల్లాల్లోనూ స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి వర్షాలు పడవచ్చని తెలిపింది.
వర్షాలతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఆశ్రయం పొందవద్దని సూచించారు. గాలుల తీవ్రత సమయంలో బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని కోరారు.
రహదారులపై ప్రయాణించే వారు వర్షం, గాలుల పరిస్థితులను గమనిస్తూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. విద్యుత్ తీగలు తెగిపడిన ప్రాంతాలకు దూరంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. వాతావరణ శాఖ సూచనలను పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్