కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శలు
మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని, బీజేపీపై లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Ramchandar rao


హైదరాబాద్ , 30 అక్టోబర్ (హి.స.)

మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని, బీజేపీపై లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నది శుభ్రతకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని, అయితే 'గాంధీ సరోవరం' నిర్మిస్తామనే నెపంతో నిరుపేదల ఆవాసాలను నేలమట్టం చేయడాన్ని ఖచ్చితంగా నిరసిస్తున్నామని స్పష్టం చేశారు.

నాంపల్లిలోని పార్టీ ముఖ్య కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు ససమయానికి వేతనాలు, అసిస్టెంట్లకు పింఛన్లు కూడా ఇవ్వలేని ఆర్థిక స్థితిలో ఉన్న ప్రభుత్వం, ఈ ప్రాజెక్టు కోసం వేల కోట్ల రూపాయలు ఎలా కేటాయిస్తోందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్లకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ప్రక్షాళన చర్యలు చేపట్టాలని హితవు పలికారు.

అలాగే, ఢిల్లీ వేదికగా ప్రతిపక్షాలు నిర్వహిస్తున్న 'మాక్ పార్లమెంట్'పై ఆయన ఘాటుగా స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కాంగ్రెస్ అపహాస్యం చేస్తోందని విమర్శించారు. గతంలో యూపీఏ హయాంలో ములాయం సింగ్ యాదవ్ మాక్ పార్లమెంట్ చేపట్టినప్పుడు అభ్యంతరం తెలిపిన సోనియా గాంధీ వైఖరిని, పార్లమెంట్ను అత్యున్నత దేవాలయంగా అభివర్ణించిన మాజీ స్పీకర్ మీరా కుమార్ మాటలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాంగ్రెస్ నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసమే ఇలాంటి డ్రామాలకు తెరలేపుతున్నారని దుయ్యబట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande