పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి
సూర్యాపేట జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పిడుగుపాటు కారణంగా ఓ గొర్రెల కాపరి ప్రాణాలు కోల్పోయారు.
Thunderstorms


హైదరాబాద్ , 31 అక్టోబర్ (హి.స.)

సూర్యాపేట జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పిడుగుపాటు కారణంగా ఓ గొర్రెల కాపరి ప్రాణాలు కోల్పోయారు. పెన్పహాడ్ మండలం మాచారం గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. గొర్రెలను మేపుతున్న సమయంలో నాగరాజుపై పిడుగు పడినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.

మృతుడిని నాగరాజుగా గుర్తించారు. ఆయన గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నాగరాజు మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పిడుగుపాటు ఘటన గురించి తెలుసుకున్న గ్రామస్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా రైతులు, పశువుల కాపరులు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande