
మచిలీపట్నం , 30 అక్టోబర్ (హి.స.)
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భారీ వర్షం కురుస్తోంది. అర్నబ్ తుపాను ప్రభావంతో బందరు పట్టణాన్ని మరోసారి వర్షపు నీరు ముంచెత్తింది. కొద్దిసేపు కురిసిన కుండపోత వర్షానికే నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. ముఖ్యంగా ప్రధాన వీధులు, రహదారులపై పెద్దఎత్తున వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పట్టణంలోని ప్రధాన మార్గాల్లో మోకాళ్ల లోతు వరకు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు నీటిలో ప్రయాణించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. అత్యవసర పనులపై బయటకు వెళ్లాల్సిన వారు కూడా వర్షం, రహదారులపై నిలిచిన నీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తుపాను ప్రభావంతో వాతావరణం ప్రతికూలంగా మారడంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరే అవకాశం ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్