మియాపూర్ భూముల తీర్పు సుప్రీంకోర్టు సంచలనం: రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు, కేసీఆర్కు సవాల్
మియాపూర్లోని 550 ఎకరాల అత్యంత విలువైన భూమిపై సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా రావడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
Court


హైదరాబాద్ , 30 అక్టోబర్ (హి.స.)

మియాపూర్లోని 550 ఎకరాల అత్యంత విలువైన భూమిపై సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా రావడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ వేదికగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు ₹1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను ఆక్రమణల నుంచి కాపాడినట్లు, అందులో కేవలం మియాపూర్ భూముల విలువే దాదాపు ₹50 వేల కోట్లు ఉంటుందని వెల్లడించారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ భూ వ్యవహారాల్లో మాజీ సీఎం కేసీఆర్, ఆయన బంధువు దామోదర్ రావు, గోల్డ్స్టోన్ ప్రసాద్లపై సీఎం సంచలన ఆరోపణలు చేశారు. ఈ డీల్లో భాగంగా విలాసవంతమైన కార్లు, భారీగా నగదు ముడుపులు లంచంగా మారాయని పేర్కొన్నారు. తాను గతంలో ప్రజాప్రతినిధిగా ఉన్నప్పటి నుంచే ఈ భూములపై పోరాటం చేస్తున్నానని, సుప్రీం తీర్పు నేపథ్యంలో తక్షణమే ఆ భూములను స్వాధీనం చేసుకుని పరిరక్షించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

దీంతో పాటు ఐఎంజీ భారత్ భూములు, కంచ గచ్చిబౌలి, మామిడిపల్లి, గుర్రంగూడ అటవీ ప్రాంతాలు, మంచిరేవుల 143 ఎకరాలతో పాటు భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని అటవీ భూముల అక్రమాల్లో కేటీఆర్, బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందన్నారు. పద్మాలయ స్టూడియోస్, లాంకో భూముల వ్యవహారాలను గతంలో ఎందుకు తేల్చలేదని కేసీఆర్, హరీశ్రావులను ప్రశ్నించారు.

అలాగే, ప్రభుత్వ భూముల విక్రయం ద్వారా వచ్చే నిధులను రాష్ట్రంలోని విద్య, వైద్యం, సాగునీరు, మౌలిక వసతుల కల్పనకు వినియోగించే ఆలోచనలో ఉన్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేసి తగిన నివేదిక ఇస్తుందని, ఆ తర్వాత క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ మొత్తం అంశంపై, సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించాలని కేసీఆర్, కేటీఆర్లకు సవాల్ విసిరిన సీఎం, అసెంబ్లీ వేదికగా బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande