
అమరావతి , 31 అక్టోబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లోని మధ్య ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా సోమ, మంగళవారాల్లో ఆయా ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో వర్ష తీవ్రత మరింత పెరిగి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
వర్షాలతో పాటు తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. సముద్ర తీరానికి సమీపంలో గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అప్రమత్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్