
అమరావతి , 31 అక్టోబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రేపు మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఓటింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నవంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.
మరోవైపు ఎన్నికలకు ముందే కూటమి కొన్ని స్థానాల్లో ఆధిక్యత సాధించింది. ఇప్పటికే 17 మున్సిపాలిటీల్లో ఛైర్పర్సన్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు 15 మంది ఉండగా, జనసేన, బీజేపీ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. కడప జిల్లాలోనూ ఆరు పట్టణ స్థానిక సంస్థలు కూటమి ఖాతాలో చేరాయి.
వార్డులు, డివిజన్లలో కూడా ఏకగ్రీవ ఎన్నికలు గణనీయంగా నమోదయ్యాయి. మొత్తం వార్డుల్లో 21 శాతానికి పైగా స్థానాలు, డివిజన్లలో 12 శాతానికి పైగా స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 13 కార్పొరేషన్ల పరిధిలోని మొత్తం 922 డివిజన్లకు గాను 118 చోట్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. మిగిలిన స్థానాల్లో రేపు ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ ద్వారా వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలోని పట్టణ రాజకీయ సమీకరణాలపై ఆసక్తిని పెంచుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్