ఏపీకి విద్యుత్ పునరుద్ధరణలో అండగా తెలంగాణ.. గొట్టిపాటికి భట్టి విక్రమార్క ఫోన్
తుపాను ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులకు తెలంగాణ ప్రభుత్వం సహకారం అందించేందుకు ముందుకొచ్చింది.
Mr Bhatti Vikramarka


అమరావతి , 31 అక్టోబర్ (హి.స.)

తుపాను ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులకు తెలంగాణ ప్రభుత్వం సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటికి ఫోన్ చేసి పరిస్థితులపై ఆరా తీశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.

క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, విద్యుత్ పునరుద్ధరణ పనుల పురోగతిని మంత్రి గొట్టిపాటి ఆయనకు వివరించారు. అవసరమైన సిబ్బంది లేదా పరికరాల కొరత ఉంటే వెంటనే తెలియజేయాలని భట్టి విక్రమార్క సూచించారు. ఆంధ్రప్రదేశ్కు అవసరమైన ఎలాంటి సహాయాన్నైనా అందించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.

ఇప్పటికే తెలంగాణకు చెందిన 1,100 మందికి పైగా విద్యుత్ శాఖ సిబ్బంది ఏపీలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సేవలందిస్తున్నారని భట్టి విక్రమార్క వెల్లడించినట్లు గొట్టిపాటి తెలిపారు. మరోవైపు ఏపీ డిస్కంలకు చెందిన సుమారు 4,400 మంది సిబ్బంది కూడా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారని మంత్రి వివరించారు. రెండు రాష్ట్రాల విద్యుత్ శాఖల సమన్వయంతో పనులను వేగవంతం చేసి ప్రజలకు సాధ్యమైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande