
హైదరాబాద్, 31 అక్టోబర్ (హి.స.)
తెలంగాణ రాజకీయాల్లో ఉత్తర తెలంగాణపై బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తోంది. నవంబర్ నెల మొత్తం ప్రజా క్షేత్రంలో ఉండాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయించారు.
ఇందులో భాగంగా రైతు సమస్యలను ప్రధాన అస్త్రంగా చేసుకుని వరుస బహిరంగ సభలకు కార్యాచరణ రూపొందించారు. వ్యవసాయానికి సాగునీరు అందకపోవడం, తాగునీటి కొరత వంటి అంశాలతో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ‘రైతు గర్జన’ పేరిట ఈ సభలను నిర్వహించనున్నారు.
క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్‌ను యాక్టివ్ చేసేందుకు నెల రోజుల్లో నాలుగు కీలక కార్యక్రమాలు ప్లాన్ చేశారు. బీఆర్ఎస్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 1న ఆదిలాబాద్‌లో తొలి రైతు గర్జన సభతో శ్రీకారం చుట్టనున్నారు.
అనంతరం నవంబర్ 11న నిర్మల్‌లో, నవంబర్ 19న నిజామాబాద్‌లో రెండో, మూడో విడత సభలు జరుగనున్నాయి. ఈ మూడు సభల్లోనూ రైతులు పడుతున్న ఇబ్బందులు, సాగునీటి లభ్యత, ప్రభుత్వ సాయం అందకపోవడంపై ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు.
ఇక నవంబర్ 29న కరీంనగర్ వేదికగా దీక్షా దివస్ సభ నిర్వహించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు