ప్రభుత్వ భూముల వేలం నిర్ణయంపై సీపీఎం అభ్యంతరం: పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరిక
హైదరాబాద్ శివార్లతో పాటు తెలంగాణలోని ప్రధాన పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్తులు, ప్లాట్లను వేలం వేసి ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది.
Land registration


హైదరాబాద్ , 31 అక్టోబర్ (హి.స.)

హైదరాబాద్ శివార్లతో పాటు తెలంగాణలోని ప్రధాన పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్తులు, ప్లాట్లను వేలం వేసి ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ విషయమై సీపీఎం నాయకులు ఈరోజు ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రజా సమక్షంలో ఉన్న ఖరీదైన భూములను కార్పొరేట్ సంస్థలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టడం సరికాదని మండిపడ్డారు.

ప్రభుత్వ భూములను అమ్మి ఆదాయం పెంచుకోవాలనుకోవడం బాధ్యతారాహిత్యమని, ఆ భూములను ఆసుపత్రులు, పాఠశాలలు, పేదల ఇళ్ల స్థలాల కేటాయింపు మరియు ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాలని వారు డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లి భూముల వేలం ప్రక్రియను కొనసాగిస్తే, ప్రజాసంఘాలు, నిరుద్యోగులు మరియు బాధితుల తరఫున రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు మరియు ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

గత ప్రభుత్వాల హయాంలో కూడా భూముల అమ్మకాలను వ్యతిరేకించామని, ఇప్పుడు అదే విధానాన్ని అవలంబించడం ప్రజా వ్యతిరేక చర్య అని విమర్శించారు. సేకరించిన భూములను తిరిగి ప్రజా ప్రయోజనాలకే వినియోగించేలా ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు. రానున్న రోజుల్లో ఈ అంశంపై అన్ని ప్రజాస్వామ్య శక్తులను కలుపుకుని కార్యాచరణ ప్రకటిస్తామని సీపీఎం నాయకులు స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande