
అమరావతి , 31 అక్టోబర్ (హి.స.)
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక విజయాన్ని అందుకుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చేపట్టిన జీఎస్ఎల్వీ ఎఫ్-18 ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ ద్వారా ఎన్వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించారు. భారతదేశ సొంత నావిగేషన్ వ్యవస్థ నావిక్ను మరింత ఆధునికంగా, బలోపేతంగా తీర్చిదిద్దడంలో ఈ ప్రయోగం కీలక పాత్ర పోషించనుంది.
ఎన్వీఎస్-03 ఉపగ్రహంలో స్వదేశీతో పాటు విదేశీ అణు గడియారాలను కూడా అమర్చారు. వీటి సాయంతో కచ్చితమైన సమయాన్ని, స్థాన సమాచారాన్ని గుర్తించే సామర్థ్యం మరింత మెరుగుపడనుంది. భారత సరిహద్దుల చుట్టూ సుమారు 1,500 కిలోమీటర్ల పరిధిలో లొకేషన్ సమాచారాన్ని అందించేలా ఉపగ్రహాన్ని రూపొందించారు. రవాణా, రక్షణ, నౌకాయానం, విపత్తుల నిర్వహణ వంటి రంగాలకు ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది.
ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు. ఎన్వీఎస్-03 ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలో చేరి సుమారు 13 ఏళ్ల పాటు సేవలు అందించనుందని తెలిపారు. ఈ ప్రయోగంతో దేశీయ నావిగేషన్ సేవల సామర్థ్యం పెరగడంతో పాటు అంతరిక్ష రంగంలో భారత్ మరో ముందడుగు వేసినట్లయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్