హైస్పీడ్ రైలు ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలి: రైల్వే మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలో ప్రతిపాదించిన హైస్పీడ్ రైలు ప్రాజెక్టుల పనులను త్వరితగతిన ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
Telangana CM Revanth Reddy


హైదరాబాద్ , 31 అక్టోబర్ (హి.స.)

తెలంగాణలో ప్రతిపాదించిన హైస్పీడ్ రైలు ప్రాజెక్టుల పనులను త్వరితగతిన ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టాల్సిన రైల్వే అభివృద్ధి పనులు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పురోగతిపై ఇరువురూ చర్చించారు.

ముఖ్యంగా తెలంగాణకు ప్రయోజనం చేకూర్చే మూడు హైస్పీడ్ రైలు కారిడార్ల ఏర్పాటుపై సీఎం కేంద్ర మంత్రితో మాట్లాడారు. ఈ మూడు కారిడార్లకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్రానికి పంపించినట్లు వివరించారు. వాటికి సంబంధించిన అలైన్మెంట్లను కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా ఖరారు చేసి ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.

అలైన్మెంట్లకు అధికారిక అనుమతులు లభించిన వెంటనే భూసేకరణ ప్రక్రియను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం నుంచి అనుమతులు ఆలస్యం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు త్వరగా కార్యరూపం దాల్చితే రాష్ట్రంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి కూడా ఊతం లభిస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande