నేరాల నియంత్రణకు కమ్యూనిటీ కనెక్ట్ - సీపీ సునీల్ దత్
ప్రజలకు భద్రతపై భరోసా కల్పించేందుకు, నేరాల అదుపులో ప్రజలను భాగస్వాములను చేసేందుకే కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.
ఖమ్మం పోలీస్


ఖమ్మం, 31 అక్టోబర్ (హి.స.)

ప్రజలకు భద్రతపై భరోసా కల్పించేందుకు, నేరాల అదుపులో ప్రజలను భాగస్వాములను చేసేందుకే కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.

ఖమ్మం డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం వారు జిల్లాలోని టేకులపల్లి గ్రామంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానితుల వివరాలను సేకరించారు.

తనిఖీల్లో సరైన పత్రాలు లేని 62 బైకులు, 5 ఆటోలను సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. 105 మంది వేలిముద్రలను సేకరించి పరిశీలించారు. ఈ సోదాల్లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు, గంజాయి సేవిస్తున్న 12 మంది, చోరీ కేసుల్లో నిందితులైన ముగ్గురు, ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

వారి నుంచి 50 గ్రాముల పొడి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. తనిఖీల్లో సీఏఆర్ ఫోర్స్, టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్, ఈగల్ ఫోర్స్, క్లూస్ టీమ్ లకు చెందిన మొత్తం 286 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ..

బెల్ట్ షాపులపై ఎక్సైజ్ శాఖతో మాట్లాడి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువత చెడు అలవాట్లకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. టేకులపల్లి ప్రాంతాన్ని నేరరహితంగా తీర్చిదిద్దేందుకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande