తెలంగాణలో క్రాప్ హాలిడే ప్రచారం అవాస్తవం: స్పష్టం చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రాష్ట్రంలో రాబోయే వ్యవసాయ సీజన్కు సంబంధించి క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారంటూ ప్రతిపక్షాలు మరియు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్పష్టత ఇచ్చారు.
Crop


హైదరాబాద్ , 31 అక్టోబర్ (హి.స.)

రాష్ట్రంలో రాబోయే వ్యవసాయ సీజన్కు సంబంధించి క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారంటూ ప్రతిపక్షాలు మరియు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం ఎక్కడా క్రాప్ హాలిడే ప్రకటించలేదని, ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు మరియు ఎల్-నినో (El Niño) ప్రభావం చూపే అవకాశాలు ఉన్నందున, రైతాంగాన్ని నష్టపోకుండా కాపాడేందుకు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. గడిచిన ఆరు నెలలుగా వాతావరణ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, భూగర్భ జలాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అత్యధిక నీటి వినియోగం అయ్యే పంటలకు బదులుగా ఆరుతడి పంటలు, నూనెగింజలు, పప్పుధాన్యాలు మరియు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు.

రైతులు అనవసరమైన పుకార్లను నమ్మవద్దని, ప్రతి వారం వాతావరణం, వర్షపాతం, నీటి నిల్వల ఆధారంగా వ్యవసాయ నిపుణుల సలహాలను పాటించాలని తుమ్మల సూచించారు. ఆయిల్ పామ్ వంటి లాభదాయక పంటల వైపు మొగ్గు చూపిన రైతులకు ప్రభుత్వం తరఫున సబ్సిడీలు మరియు సాంకేతిక సహాయం అందిస్తామని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులలో ఉన్న నీటి మట్టాలను పరిగణనలోకి తీసుకుని పంటల ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande