
పశ్చిమ గోదావరి జిల్లా , 31 అక్టోబర్ (హి.స.)
పశ్చిమ గోదావరి జిల్లాలో తుపాను ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చేపడుతున్న పనులపై మంత్రి నిమ్మల సమీక్ష నిర్వహించారు. పాలకొల్లులోని విద్యుత్ కేంద్రాలను సందర్శించి, పునరుద్ధరణ పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. అధికారులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, పనుల వేగం గురించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సాధారణ పరిస్థితుల్లో నెల రోజుల సమయం పట్టే పనులను కేవలం వారంలోనే పూర్తి చేసే లక్ష్యంతో చర్యలు చేపట్టినట్లు తెలిపారు. విద్యుత్ సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు భారీ స్థాయిలో యంత్రాలు, అవసరమైన పరికరాలను సమకూర్చినట్లు వెల్లడించారు. మరమ్మతు పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.
పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అదనపు విద్యుత్ సిబ్బందిని రప్పించి విధుల్లో నియమించినట్లు మంత్రి వివరించారు. సిబ్బంది పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టపడుతూ విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు శ్రమిస్తున్నారని ప్రశంసించారు. ప్రజలకు విద్యుత్ ఇబ్బందులు వీలైనంత త్వరగా తొలగించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్