అభివృద్ధి పనులలో జాప్యం.. అధికారులపై ఎంపి అరవింద్ ఆగ్రహం
నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అధికారులను ఆదేశించారు.
Mp


నిజామాబాద్, 31 అక్టోబర్ (హి.స.)

నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అధికారులను ఆదేశించారు.

అధికారులంతా సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు. ఎంపీ ధర్మపురి అరవింద్ అధ్యక్షతన శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో దిశా (జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ) సమావేశం జరిగింది.

సమావేశంలో పలు శాఖల అధికారులు, ముఖ్యంగా ఆర్ అండ్ బీ అధికారులు అసంపూర్తి సమాచారంతో సమాధానాలు ఇవ్వడంపై ఎంపీ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి అభివృద్ధి పనికి సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధంగా రావాలని, పనుల పురోగతిపై స్పష్టమైన లెక్కలతో సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా నగరంలో జరుగుతున్న యూజీడీ పనుల పురోగతిపై ఎంపీ ఆరా తీశారు. ఎంత మేర పనులు పూర్తయ్యాయి, పెండింగ్ పనుల పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నించారు. ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేస్తామని అధికారులు సమాధానం ఇవ్వగా, ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ సూచించారు.

సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, డీఆర్వో గీత, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మేయర్ ఉమారాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande