హైదరాబాద్ను ముంచెత్తిన హఠాత్ వర్షం: తీవ్రంగా స్తంభించిన నగర ట్రాఫిక్
హైదరాబాద్ నగరంలో ఈరోజు మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
Rain


హైదరాబాద్ , 31 అక్టోబర్ (హి.స.)

హైదరాబాద్ నగరంలో ఈరోజు మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాలలో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి మరియు పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వాన పడింది.

హఠాత్తుగా కురిసిన వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్ మార్గాల్లోనూ, బేగంపేట్ ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లోనూ నిలిచిన వరద నీటి వల్ల వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మధ్యాహ్నం ఆఫీసు పనులపై బయటకు వచ్చిన ప్రజలు, వాహనదారులు, పాఠశాల విద్యార్థులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి తీవ్ర అవస్థలు పడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) సిబ్బంది, నగర ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. మ్యాన్హోళ్ల వద్ద చేరుకున్న చెత్తను తొలగించి, మోటార్ల ద్వారా నీటిని తోడివేస్తూ పోంగిపొర్లుతున్న వరద నీటిని నివారించేందుకు చర్యలు చేపట్టారు. నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande