
హైదరాబాద్ , 31 అక్టోబర్ (హి.స.)
ఇటీవల కురిసిన వర్షాలు మరియు ఉష్ణోగ్రతల్లో వస్తున్న మార్పుల కారణంగా తెలంగాణవ్యాప్తంగా డెంగ్యూ, టైఫాయిడ్ మరియు ఇతర సీజనల్ జ్వర బాధితుల సంఖ్య పెరగడంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ తీవ్రంగా స్పందించింది. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు నేడు జిల్లాల వైద్యాధికారులతో (DMHO) సమీక్షా సమావేశం నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా 'హై అలర్ట్' ప్రకటించారు.
పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లో దోమల నివారణకు ఫాగింగ్, నిల్వ నీటిలో లార్వా నాశక పిచికారీ చర్యలను ముమ్మరం చేయాలని పంచాయతీ రాజ్, పురపాలక శాఖలను ఆదేశించారు. హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆసుపత్రులతో పాటు అన్ని జిల్లా సర్వజన ఆసుపత్రుల్లో ప్రత్యేక డెంగ్యూ వార్డులు, సరిపడా ప్లాస్మా నిల్వలు మరియు మందులను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్