విశాఖ నావెల్ డాక్యార్డ్లో తప్పిన పెను ప్రమాదం.. సురక్షితంగా నేవీ సిబ్బంది
విశాఖపట్నంలోని నావెల్ డాక్యార్డ్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ కేసరి ప్రమాదానికి గురైంది.
విశాఖ నావెల్ డాక్యార్డ్లో తప్పిన పెను ప్రమాదం.. సురక్షితంగా నేవీ సిబ్బంది


విశాఖపట్నం , 31 అక్టోబర్ (హి.స.)

విశాఖపట్నంలోని నావెల్ డాక్యార్డ్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ కేసరి ప్రమాదానికి గురైంది. డాక్యార్డ్లో మరమ్మతులు పూర్తి చేసుకున్న ఈ నౌక తిరిగి సముద్రంలోకి ప్రయాణించేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. నౌక ముందుభాగం కొంత మేర నీటిలోకి మునిగిపోవడంతో అక్కడ ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.

ఈ పరిణామాన్ని గుర్తించిన నేవీ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. నౌకలో ఉన్న సిబ్బంది భద్రతకు ప్రాధాన్యతనిస్తూ రక్షణ, సహాయక చర్యలు ప్రారంభించారు. సిబ్బందికి ఎలాంటి ప్రాణాపాయం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దృష్టి సారించారు.

ఇటీవలే ఐఎన్ఎస్ కేసరి మరమ్మతు పనులు పూర్తిచేసుకుని తిరిగి విధుల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నౌక ముందుభాగం ఎందుకు మునిగింది? సాంకేతిక లోపం ఏమైనా ఉందా? అనే అంశాలపై పరిశీలన జరగాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, నష్టంపై నేవీ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande