అక్టోబర్ 10 నుంచి బతుకమ్మ సంబరాలు
ఈ ఏడాది అక్టోబర్ 10 నుంచి 18 వరకు తొమ్మిది రోజులపాటు బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు.
Bhatukamma


హైదరాబాద్ , 04 అక్టోబర్ (హి.స.)తెలంగాణకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచే బతుకమ్మ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 10 నుంచి 18 వరకు తొమ్మిది రోజులపాటు బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 18న సద్దుల బతుకమ్మను హైదరాబాద్ ట్యాంక్బండ్ వద్ద ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

ప్రధాన కార్యక్రమంలో వేలాది మంది మహిళలు పాల్గొనే అవకాశం ఉండటంతో ట్రాఫిక్, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, భద్రత, వైద్య సహాయం వంటి అంశాలపై ముందుగానే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక స్థలం నుంచి సాయంత్రం 4 గంటలకు బతుకమ్మల ఊరేగింపు ప్రారంభమై ట్యాంక్బండ్ వైపు వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు కూడా ఈ ఊరేగింపులో పాల్గొని తెలంగాణ సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande