
అమరావతి, 04 అక్టోబర్ (హి.స.)గత కొన్ని రోజులుగా ఎండలు, ఉక్కపోతతో నలిగిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఒక కూల్ న్యూస్ చెప్పింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వెదర్ ఒక్కసారిగా మారిపోనుంది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై, రాగల కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది.
ఇప్పటికే భారత వాతావరణ శాఖ రెండు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసేసింది. పలు ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వానలు పడే సూచనలు స్పష్టంగా కనిపించేస్తున్నాయి.
ఇక, ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకారం.. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా సోమవారం (05-10-2026) అనకాపల్లి, కాకినాడ, కోణసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అక్కడక్కడ మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సూచించింది. అంతేకాకుండా.. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు, ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు హెచ్చరించారు.
ఇక, హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని ఉత్తర, తూర్పు జిల్లాలైన ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో ఆదివారం అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం వుంది.
రాజధాని హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే ఛాన్స్ ఉంది. అయితే, రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో వాయుగుండం బలపడటంతో అక్టోబర్ 5, 6, 7 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు మరింత ముదిరే అవకాశముందని ఐఎండీ తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV