శ్రీ సిటీలో ఫార్మా పరిశ్రమలో బాయిలర్ పేలుడు ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి
బాయిలర్ పేలుడు ఘటనలో తాజా సమాచారం ప్రకారం ఐదుగురు కార్మికులు మృతి చెందగా, మరో పది మంది గాయపడ్డారు.
Fire


తిరుపతి , 04 అక్టోబర్ (హి.స.)తిరుపతి జిల్లాలో శ్రీ సిటీ పారిశ్రామిక ప్రాంతంలో శనివారం నాడు జరిగిన బాయిలర్ పేలుడు ఘటనలో తాజా సమాచారం ప్రకారం ఐదుగురు కార్మికులు మృతి చెందగా, మరో పది మంది గాయపడ్డారు.

సత్యవేడు మండలంలోని శ్రీ సిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలోని టీఐఎల్ హెల్త్కేర్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...... ఫ్యాక్టరీలోని నీటి బాయిలర్ ఒక్కసారిగా పేలడంతో భారీ శబ్దం వచ్చింది. పేలుడు తీవ్రతకు పరిశ్రమలోని ఒక భాగం దెబ్బతినడంతో పాటు భవనం పైకప్పులో కొంత భాగం కూలిపోయింది. ప్రమాద సమయంలో పరిశ్రమలో విధుల్లో ఉన్న కార్మికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. పేలుడు అనంతరం అక్కడ మంటలు చెలరేగడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది, స్థానికులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు.

కొంతమంది కార్మికులు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరికొందరిని సమీప ఆసుపత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో కూడా మరణాలు సంభవించడంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం తేలనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande