
హైదరాబాద్ , 04 అక్టోబర్ (హి.స.)తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డుకు సంబంధించిన రూ.2,944 కోట్ల హడ్కో రుణంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రుణానికి వర్తించే 2 శాతం గ్యారంటీ కమిషన్ను మినహాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం రూ.7,360 కోట్ల విలువైన ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 40 శాతంగా ఉంది. మిగిలిన 60 శాతం నిధులను ఎంపికైన ప్రైవేట్ సంస్థ హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో సమకూర్చనుంది. ఇలాంటి భారీ నీటి మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ప్రభుత్వం తన వాటాను సమయానికి సమకూర్చడం అత్యంత కీలకం. ముఖ్యంగా హైదరాబాద్ భవిష్యత్ తాగునీటి అవసరాలు, నగరంలోని మురుగు నీటి నిర్వహణ, నదీ పునరుద్ధరణ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
హడ్కో రుణంపై వార్షిక వడ్డీ రేటును 8.97 శాతం నుంచి 8.85 శాతానికి తగ్గించినట్లు కూడా సమాచారం. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ హామీపై సాధారణంగా విధించే 2 శాతం గ్యారంటీ కమిషన్ను మినహాయించడం వల్ల ప్రాజెక్టు ఆర్థిక భారం కొంత మేర తగ్గే అవకాశం ఉంది. రుణానికి సంబంధించి అసలు, వడ్డీ చెల్లింపులను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సహాయంతో నిర్వహించనుంది. హైదరాబాద్లో నీటి సరఫరా భద్రతను పెంచడం, భవిష్యత్ అవసరాలకు తగిన మౌలిక వసతులు ఏర్పాటు చేయడం ప్రస్తుతం ప్రభుత్వానికి ప్రధాన అంశాల్లో ఒకటి. మూసీ పునరుద్ధరణ కూడా కేవలం నది సుందరీకరణకు పరిమితం కాకుండా నీటి వనరులు, మురుగు నిర్వహణ, పర్యావరణం, పట్టణాభివృద్ధితో ముడిపడి ఉంది. అందువల్ల ఈ రుణానికి సంబంధించిన ఆర్థిక నిర్ణయం రాబోయే మౌలిక వసతుల పనులకు కీలకంగా మారనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్