
అమరావతి , 04 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులు, పరిశ్రమలు, టెక్నాలజీ రంగాలకు దేశంలోని అత్యంత ఆకర్షణీయమైన కేంద్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. విజయవాడలో జరిగిన పాన్-ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సదస్సులో ఆయన రాష్ట్ర పెట్టుబడి విధానం, పరిశ్రమల అభివృద్ధి, ఏఐ ఆధారిత పాలన, 23 రంగాల క్లస్టర్ల గురించి వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పాటిస్తున్న విధానాన్ని ‘స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ’గా ఆయన వివరించారు.
పెట్టుబడులు ఆకర్షించడమే కాకుండా అవి వాస్తవ పరిశ్రమలుగా మారేలా చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ చెప్పారు. గతంలో పెట్టుబడుల విషయంలో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడంపై ఎక్కువ దృష్టి ఉండేదని, ఇప్పుడు ప్రాజెక్టులను వేగంగా అమల్లోకి తీసుకురావడం, ఉపాధి కల్పించడం, పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టామని వివరించారు.
హార్టికల్చర్, వ్యవసాయం, మెడికల్ డివైసెస్, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్, సిమెంట్, సౌరశక్తి, పునరుత్పాదక ఇంధనం, స్పేస్ టెక్నాలజీ, డ్రోన్లు, క్వాంటమ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలకు ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలతో పాటు పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, సరఫరా వ్యవస్థలను ఒకే ఎకోసిస్టమ్లో అనుసంధానించడమే ఈ క్లస్టర్ల ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఏపీలో పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం ఒక ఏడాదిలో 4.8 గిగావాట్ల మేర పెరిగిందని లోకేశ్ తెలిపారు. రాబోయే కాలంలో మరింత వేగంగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్