డిగ్రీలు మాత్రమే కాదు.. పరిశ్రమలకు సిద్ధమయ్యేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి: శ్రీధర్ బాబు
తెలంగాణలో ఉన్నత విద్యా వ్యవస్థను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
Minister sridhar babu


హైదరాబాద్ , 04 అక్టోబర్ (హి.స.)తెలంగాణలో ఉన్నత విద్యా వ్యవస్థను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో పాత తరహా పాఠ్యాంశాలతో మాత్రమే విద్యార్థులను ఉద్యోగ మార్కెట్కు సిద్ధం చేయలేమని ఆయన అన్నారు.

హైదరాబాద్లో జరిగిన REACH 2026 సదస్సులో ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు. విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసే సమయానికే ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు పొందడంతో పాటు పరిశోధన, ఆవిష్కరణలు, స్టార్టప్ రంగంలో పనిచేసే సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాలని మంత్రి సూచించారు.

డిగ్రీ ఆధారిత విద్య నుంచి నైపుణ్య ఆధారిత విద్య వైపు మారాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, డేటా సైన్స్, రోబోటిక్స్, క్లౌడ్ టెక్నాలజీ వంటి రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ మార్పుల నేపథ్యంలో విశ్వవిద్యాలయాలు తమ పాఠ్య ప్రణాళికలను తరచూ నవీకరించుకోవాల్సిన అవసరం ఉంది. పరిశ్రమలు ఏ నైపుణ్యాలను కోరుకుంటున్నాయో ముందుగానే తెలుసుకుని విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ద్వారా చదువు పూర్తయ్యే సమయానికే వారు ఉద్యోగాలకు సిద్ధంగా ఉండేలా చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

విశ్వవిద్యాలయాల్లో పరిశ్రమల సహకారంతో ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం, పరిశోధనకు ప్రాధాన్యం ఇవ్వడం, పూర్వ విద్యార్థుల నెట్వర్క్ను బలోపేతం చేయడం వంటి సూచనలు కూడా చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande