
అమరావతి , 04 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన, పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించే దిశగా కీలక పురోగతి నమోదైంది. 32వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ 2026–27 కోసం రాష్ట్రవ్యాప్తంగా 9,884 మంది బాల శాస్త్రవేత్తలు నమోదు చేసుకున్నారు. వీరు మొత్తం 2,554 ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయికి సమర్పించినట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధికారులు తెలిపారు.
విజయవాడలో జరిగిన సమీక్షా సమావేశంలో నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ కె. శరత్కుమార్ కార్యక్రమ పురోగతిని వెల్లడించారు. మొత్తం 4,942 గ్రూపులు నమోదు చేసుకోగా, వాటిలో 3,665 గ్రూపుల ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. మరో 1,063 గ్రూపుల ప్రాజెక్టులు పరిశీలనలో లేదా హోల్డ్లో ఉన్నాయి.
214 గ్రూపుల ప్రాజెక్టులను తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాలికల భాగస్వామ్యం 53 శాతంగా ఉండటం ప్రత్యేకంగా ప్రస్తావించదగ్గ అంశం. బాలుర వాటా 47 శాతంగా ఉంది. 10 నుంచి 14 సంవత్సరాల జూనియర్ కేటగిరీ, 14 నుంచి 17 సంవత్సరాల సీనియర్ కేటగిరీ విద్యార్థులతో పాటు దివ్యాంగ విద్యార్థులు కూడా ఇందులో పాల్గొంటున్నారు.
ఈ ఏడాది సైన్స్ కాంగ్రెస్లో వ్యర్థాల నిర్వహణ, శక్తి, నీటి సంరక్షణ, ఆహారం, వ్యవసాయం, ఆరోగ్యం, భారతీయ విజ్ఞాన సంప్రదాయాల ఆధారంగా స్థిరమైన అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అంటే విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాల్లోని సిద్ధాంతాలను చదవడం కాకుండా, తమ పరిసరాల్లో ఉన్న సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలను అన్వేషించేలా ప్రోత్సహించడమే కార్యక్రమం ఉద్దేశం.
జిల్లా స్థాయి ప్రాజెక్టుల పరిశీలన నవంబర్ మొదటి వారంలో, రాష్ట్ర స్థాయి పరిశీలన డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్