పెదకాకానిలో ఎలక్ట్రికల్ బస్సు దగ్ధం
పెద్దకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఎలక్ట్రికల్ బస్సు పూర్తిగా దగ్ధమైంది.
...పూర్తిగా కాలిపోయిన ఈ-బస్సు!


పెద్దకాకాని, 04 అక్టోబర్ (హి.స.)ఓ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం అయిన సంఘటన గుంటూరు జిల్లా పెదకాకాని పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి.

శ్రీకాళహస్తి నుంచి విజయవాడ బయలుదేరిన ఆటోనగర్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్, వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. ప్రయాణికులందరినీ వెంటనే కిందకు దింపేయడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది.

బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు కిందకు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు నలుమూలలకూ వ్యాపించి పూర్తిగా తగలబడిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ సకాలంలో స్పందించి చాకచక్యంగా వ్యవహరించడంతో ముప్పు తప్పిందని ప్రయాణికులు ప్రశంసించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande