
అనంతపురం, 04 అక్టోబర్ (హి.స.)అనంతపురం నగరంలోని చారిత్రక, వారసత్వ కట్టడాల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ రోజు ఉదయం హెరిటేజ్ వాక్ నిర్వహించారు.
ఓల్డ్ టౌన్లోని విక్టోరియా మెమోరియల్ హాస్పిటల్ వద్ద ప్రారంభమైన ఈ వాక్.. చెన్నకేశవ స్వామి దేవాలయం, నెంబర్ వన్ స్కూల్, విరూపాక్ష దేవాలయం, జామియా మసీదు, బసవన్న కట్ట మీదుగా సాగి సప్తగిరి సర్కిల్లోని ఐరన్ బ్రిడ్జి వద్ద ముగిసింది.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, అనంతపురం ప్రాంతంలో దాగి ఉన్న గొప్ప చారిత్రక, పురావస్తు, సాంస్కృతిక సంపదను వెలుగులోకి తీసుకురావడం, దానిని భావితరాలకు పరిచయం చేయడం, వాటి పరిరక్షణపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించడమే హెరిటేజ్ వాక్ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్, అసిస్టెంట్ కలెక్టర్ సుయాశ్ కుమార్తో పాటు హెరిటేజ్పై ఆసక్తి ఉన్న సుమారు 50 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఓ. ఆనంద్ మాట్లాడుతూ.. అనంతపురం నగరంలో సుమారు 30 నుంచి 35 వరకు హెరిటేజ్ భవనాలను గుర్తించినట్లు తెలిపారు. వాటి చరిత్ర, ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తొలిసారిగా హెరిటేజ్ వాక్ నిర్వహించినట్లు చెప్పారు.
ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న సుమారు 50 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. చరిత్ర, వారసత్వ కట్టడాలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ భవిష్యత్లో నిర్వహించే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు.హెరిటేజ్ భవనాలు, చారిత్రక కట్టడాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన పెరిగితే వాటి పరిరక్షణకు మరింత అవకాశం ఉంటుందని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV