2029 నాటికి అర్హులైన పేదలందరికీ ఇళ్లు
ఆంధ్రప్రదేశ్లో అర్హులైన పేద కుటుంబాలందరికీ 2029 నాటికి సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.
Houses in ap


అమరావతి , 05 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో అర్హులైన పేద కుటుంబాలందరికీ 2029 నాటికి సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G) 2.0 కింద రాష్ట్రానికి తాజాగా మంజూరైన 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శంకుస్థాపన చేశారు.

కేంద్రం సాధారణంగా 75 వేల ఇళ్ల కోటాను కేటాయించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో ఏపీకి వెంటనే 3 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు చంద్రబాబు తెలిపారు. నిర్మాణం ముందుకు సాగుతున్న కొద్దీ మరో 3 లక్షల ఇళ్లను, తదుపరి ఏడాది మరో 3 లక్షల ఇళ్లను కేటాయించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మరో ముఖ్యమైన అంశం 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ. బుర్రిపాలెంలో రూ.14 కోట్ల వ్యయంతో 177 ఇళ్ల పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. ఇందులో 100 సాధారణ ఇళ్లు, 77 దివ్యాంగులకు అనుకూలంగా నిర్మించే ఇళ్లు ఉన్నాయి. సాంకేతిక ప్రదర్శనల్లో ఒక ఇంటిని సుమారు పది రోజుల్లో నిర్మించే సామర్థ్యాన్ని చూపించారు. భవిష్యత్తులో ఇలాంటి సాంకేతికతను ఉపయోగించి 5 వేల ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

గ్రామీణ ప్రాంతాల్లో యూనిట్కు రూ.2.39 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2.50 లక్షల వ్యయ పరిమితిని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. గృహ నిర్మాణ సహాయాన్ని ఇతర పథకాలతో అనుసంధానించడం ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి సుమారు రూ.2.30 లక్షల వరకు ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande