
అమరావతి , 05 అక్టోబర్ (హి.స.)ఉద్యోగుల సమ్మె లేదా సిబ్బంది కొరత కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు వైద్య సేవలు నిలిచిపోకుండా ఆంధ్రప్రదేశ్ వైద్యశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది.
టీచింగ్ హాస్పిటల్స్ నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు కీలక విభాగాల్లో అందుబాటులో ఉన్న సిబ్బందిని అవసరానికి అనుగుణంగా పునర్వినియోగించుకోవాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం, ప్రసూతి సేవలు, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు, ఫార్మసీలు, ల్యాబొరేటరీలు వంటి విభాగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
ఎక్కడైనా సిబ్బంది కొరత ఏర్పడితే అర్హత కలిగిన మిడ్-లెవల్ హెల్త్ ప్రొవైడర్లు, జీఎన్ఎం శిక్షణ పొందిన సిబ్బందిని తాత్కాలికంగా సేవల్లోకి తీసుకురావాలని ప్రతిపాదించారు.
జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగుల సంఖ్యను బట్టి సిబ్బందిని సర్దుబాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మందుల సరఫరా, రక్త పరీక్షలు, ఇతర నిర్ధారణ పరీక్షలు కూడా కొనసాగేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వైద్యశాఖ సూచించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్