
అమరావతి , 05 అక్టోబర్ (హి.స.)
రాయలసీమలో జరిగిన రూ.1 లక్ష కోట్ల గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రారంభ కార్యక్రమంలో యువత ఉద్యోగాల కోసం నిరసన వ్యక్తం చేసిందంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ–విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఖండించారు.
మదనపల్లెలో జరిగిన కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో సభలో కొంత సందడి కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆ వీడియోను ఆధారంగా చేసుకుని జైరాం రమేశ్ నిరుద్యోగ సమస్యపై యువత ఆగ్రహం వ్యక్తం చేసిందని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, సభలో కనిపించిన ఉత్సాహాన్ని కోపంగా చిత్రీకరించడం వాస్తవానికి విరుద్ధమని అన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్న కార్యక్రమంలో ఉత్సాహం కారణంగా కొంతసేపు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్