
కడప, 05 అక్టోబర్ (హి.స.)గత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు తాగునీరు అందించే జలజీవన్ మిషన్ పథకాన్ని నిర్వీర్యం చేసిందని, కేవలం రూ.2,600 కోట్లే ఖర్చు చేసిందని.రాయలసీమ అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావులేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన 'జల్ జీవన్ మిషన్ 2.0 - అమరజీవి జలధార' పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు లాంఛనంగా ప్రారంభించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో రూ. 30,156 కోట్ల భారీ వ్యయంతో ఈ బృహత్తర పథకానికి వారు శ్రీకారం చుట్టారు.రాష్ట్రంలోని 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ద్వారా సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా కొత్తపల్లి వద్ద పైలాన్ను ఆవిష్కరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాయలసీమ అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే సమయం కాదు. మీ ఆవేదన, ఆవేశం నాకు అర్థమవుతున్నాయి.. దయచేసి కాస్త సంయమనంతో ఉండాలి. రాయలసీమ అభివృద్ధిలో రాజకీయాలు వద్దు. యుద్ధం వచ్చినప్పుడే కదా మాట్లాడాల్సింది.. అవతలివారు హద్దులు మీరితేనే కదా మనం యుద్ధం చేసేది అంటూ సభలో అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ప్రాంత ప్రాశస్త్యాన్ని గుర్తుచేస్తూ.. ఈ నేల 'మినీ ముంబై'గా పేరొందిందని, పౌరుషాలకు పెట్టింది పేరు అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం ఎప్పుడూ మన మనస్సుల్లో నిలిచిపోవాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే ప్రజల బాగోగులు చూసుకోవడానికని, పులివెందుల నియోజకవర్గంలోని 7 మండలాల్లో రూ. 280 కోట్లతో తాగునీటి సమస్యకు ఇప్పటికే పరిష్కారం చూపామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV