తిరుమల అలిపిరి దారిలో మళ్లీ చిరుత కలకలం
అధికారులు అప్రమత్తం.. గుంపులుగా మాత్రమే వెళ్లాలని విజ్ఞప్తి
తిరుమల అలిపిరి దారిలో మళ్లీ చిరుత కలకలం..తప్పిన పెద్ద ప్రమాదం!


తిరుమల, 05 అక్టోబర్ (హి.స.)తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుతపులి సంచారం మరోసారి తీవ్ర కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలోని 'మోకాలి మిట్ట' ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయంలో చిరుతపులి స్వేచ్ఛగా సంచరించింది.

మెట్ల దారికి అత్యంత సమీపంలో తిరుగుతున్న ఈ చిరుత కదలికలు అధికారుల కెమెరాలకు స్పష్టంగా చిక్కాయి.అయితే, ఆ సమయంలో భక్తుల రాకపోకలు చాలా తక్కువగా ఉండటంతో ఒక పెద్ద ప్రమాదం తప్పుతుందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కెమెరా దృశ్యాల ఆధారంగా చిరుత కదలికలను సకాలంలో గుర్తించిన అటవీ శాఖ, టీటీడీ భద్రతా సిబ్బంది తక్షణమే స్పందించి నిఘాను తీవ్రతరం చేశారు. ఆ ప్రాంతంలో చిరుత జాడను అనుక్షణం పర్యవేక్షిస్తూ భద్రతా చర్యలు చేపట్టారు. ఈ పరిణామంతో అలిపిరి మార్గంలో పయనించే భక్తులకు టీటీడీ పలు కీలక సూచనలు జారీ చేసింది. నడక దారిలో ప్రయాణించేవారు ఎట్టిపరిస్థితుల్లోనూ ఒంటరిగా వెళ్లకుండా తప్పనిసరిగా గుంపులుగా, సమూహాలుగా మాత్రమే ముందుకు సాగాలని కోరింది. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజాము వేళల్లో నడిచే భక్తులు మరింత అప్రమత్తంగా ఉండాలని, పిల్లల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు వహించాలని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande