బీసీలకు వైసీపీ అన్యాయం చేసింది....రామ్మోహన్ నాయుడు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
రామ్మోహన్ నాయుడు


అరసవల్లి, 05 అక్టోబర్ (హి.స.) వైసీపీపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని ఆయన ధ్వజమెత్తారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు సోమవారం దర్శించుకున్నారు.ఈ సందర్భంగా దేవాలయంలో ఇంద్ర పుష్కరిణి సందర్శించిన అనంతరం ఆలయ అధికారులు, అర్చకులతో ఆలయ అభివృద్ధిపై రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... బీసీలకు రాజ్యాధికారం దక్కకూడదనే ఉద్దేశంతోనే గతంలో వైసీపీ ప్రభుత్వం రిజర్వేషన్లను అడ్డుకుందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటాపై గతంలో కోర్టు తీర్పు ఇస్తే, దానిపై అప్పటి జగన్ ప్రభుత్వం ఎందుకు పోరాడలేదని ఆయన ప్రశ్నించారు. బీసీలకు వైసీపీ తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.ప్రస్తుత కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం సుప్రీంకోర్టులో పోరాటం చేస్తోందని తెలిపారు. గతంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిందే తెలుగుదేశం పార్టీ అని గుర్తుచేశారు. బీసీలు ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే టీడీపీ లక్ష్యమని స్పష్టం చేశారు. టీడీపీకి బీసీలే వెన్నెముక అని, తమది బీసీల పార్టీ అని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం సహకారంతో స్వదేశీ దర్శనం 2.0 కింద అరసవల్లి ఆలయానికి రూ.55.74 కోట్లు కేటాయించడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర టూరిజం మంత్రి గజేంద్ర సింగ్ షెరావత్కు శ్రీకాకుళం జిల్లా ప్రజలు తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారంతో అరసవల్లి క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని గత రెండేళ్లుగా చేసిన కృషికి ఇది ఒక మైలురాయిగా చెప్పుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande