
అమరావతి , 06 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో మహిళా స్వయం సహాయక సంఘాలను కేవలం పొదుపు, రుణ కార్యకలాపాలకే పరిమితం చేయకుండా వ్యాపార రంగంలోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో ఐదు లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం, ప్యాకేజింగ్ ప్రమాణాలను మెరుగుపరచడం, ఈ-కామర్స్ వేదికల ద్వారా అమ్మకాలను పెంచడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ ఉత్పత్తులకు ‘స్వయం ఏపీ’ అనే బ్రాండ్ను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు.
.
మహిళలు తయారు చేసే ఆహార ఉత్పత్తులు, హస్తకళలు, వస్త్రాలు, గ్రామీణ ఉత్పత్తులు వంటి వాటికి పెద్ద మార్కెట్ ఉన్నప్పటికీ బ్రాండింగ్, ప్యాకేజింగ్, నాణ్యత నియంత్రణ, డిజిటల్ మార్కెటింగ్ లోపాల కారణంగా వారు పూర్తి స్థాయి వ్యాపార ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ మద్దతుతో ఒక సమగ్ర మార్కెటింగ్ వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉంది. విజయవాడలో అక్టోబర్ 15 నుంచి 31 వరకు జాతీయ సారస్ మేళా నిర్వహణకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలాంటి మేళాలు స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను రాష్ట్ర, జాతీయ స్థాయిలో పరిచయం చేసేందుకు ఉపయోగపడతాయి. మహిళలు తయారు చేసే వస్తువులకు వినియోగదారుల నుంచి నేరుగా ఆర్డర్లు వచ్చేలా డిజిటల్ వేదికలను బలోపేతం చేయడం ద్వారా వారి ఆదాయం పెంచే అవకాశం ఉంటుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్