
హైదరాబాద్ , 06 అక్టోబర్ (హి.స.)హైదరాబాద్లో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. సనత్నగర్కు చెందిన ఓ వృద్ధురాలు సోషల్ మీడియాలో కనిపించిన డ్రైఫ్రూట్స్ విక్రయ ప్రకటనను నమ్మి సుమారు రూ.2.60 లక్షలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటన మంగళవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. తక్కువ ధరకు డ్రైఫ్రూట్స్ అందిస్తామని చెప్పి బాధితురాలిని ఆకర్షించిన నేరగాళ్లు, తర్వాత రీఫండ్ పేరుతో క్యూఆర్ కోడ్లను ఉపయోగించి ఆమె బ్యాంకు ఖాతా నుంచి వరుసగా డబ్బులు బదిలీ చేయించుకుంది.
సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో కనిపించే ప్రతి ప్రకటనను నిజమని నమ్మకూడదనే విషయాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. సాధారణంగా సైబర్ మోసగాళ్లు మొదట వినియోగదారుడి ఆసక్తిని గుర్తిస్తారు. తక్కువ ధర, ప్రత్యేక ఆఫర్, ఉచిత డెలివరీ లేదా రీఫండ్ వంటి పదాలతో ఆకర్షించి బాధితుడిని సంప్రదిస్తారు. మొదట చిన్న మొత్తంలో చెల్లింపు చేయించి, తర్వాత సాంకేతిక సమస్య వచ్చిందని లేదా రీఫండ్ చేయాల్సి ఉందని చెప్పి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయిస్తారు. ఈ కేసులో కూడా ఇదే తరహా పద్ధతిని ఉపయోగించినట్లు తెలుస్తోంది. రీఫండ్ అందుతుందని భావించిన బాధితురాలు నేరగాళ్లు పంపిన క్యూఆర్ కోడ్లను ఉపయోగించడంతో ఆమె ఖాతా నుంచి డబ్బు డెబిట్ అవుతూ వెళ్లింది. విషయం అర్థమయ్యే సమయానికి భారీ మొత్తం ఖాతా నుంచి వెళ్లిపోయింది.
బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్