తెలంగాణలో అంతర్జాతీయ విద్యకు కొత్త బాట
తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థలను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విధానం రూపొందించే దిశగా ముందుకు సాగుతోంది.
School


హైదరాబాద్ , 06 అక్టోబర్ (హి.స.)తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థలను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విధానం రూపొందించే దిశగా ముందుకు సాగుతోంది. ఫ్యూచర్ సిటీలో ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో సమగ్ర విధానం రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.

యూనివర్సిటీ ఆఫ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్తో పాటు మరో నాలుగు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు తెలంగాణలో తమ శాఖలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపినట్లు అధికారులు వెల్లడించారు.

విదేశీ విశ్వవిద్యాలయాలు తెలంగాణకు రావడం వల్ల విద్యార్థులకు దేశం విడిచి వెళ్లకుండానే అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అభ్యసించే అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమ-విద్యాసంస్థల భాగస్వామ్యం, అంతర్జాతీయ విద్యా మార్పిడి వంటి రంగాల్లో కూడా ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ప్రభుత్వం రూపొందించబోయే విధానంలో విదేశీ యూనివర్సిటీలను ఆహ్వానించడం, అవసరమైన మౌలిక వసతులు కల్పించడం, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడం, అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం వంటి అంశాలను చేర్చనున్నారు.

ఫ్యూచర్ సిటీని కేవలం ఐటీ, పరిశ్రమలు, పెట్టుబడులకు సంబంధించిన ప్రాంతంగా కాకుండా విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధికి కూడా అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రపంచ స్థాయి యూనివర్సిటీల క్యాంపస్లు ఏర్పడితే విదేశీ విద్యార్థులను కూడా హైదరాబాద్కు ఆకర్షించే అవకాశం ఉంటుంది.

ఇదే సమీక్షలో రాష్ట్రంలోని ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’ నిర్మాణంపై కూడా ప్రధాన కార్యదర్శి దృష్టి పెట్టారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దశలవారీగా ఈ పాఠశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 2027 డిసెంబర్ నాటికి 67 పాఠశాలలను పూర్తి చేయాలని, 2028 జూన్ నాటికి ఈ సంఖ్యను 87కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande